: భారత సాఫ్ట్ వేర్ రంగానికి కష్టాలు.. రోడ్డున పడనున్న 7 లక్షల మంది ఐటీ నిపుణులు
భారత ఐటీ రంగంపై ఆటొమేషన్ అత్యంత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనుంది. 2022కల్లా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతారని అమెరికా కేంద్రంగా పని చేసే రీసర్చ్ సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసర్చ్ వెల్లడించింది. తక్కువ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఉద్యోగాన్ని కోల్పోతారని తెలిపింది. ఇదే సమయంలో మధ్య స్థాయి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు లక్ష నుంచి 1.9 లక్షలకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆటోమేషన్ వల్ల ఉన్నత స్థాయి నైపుణ్యాల ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపింది. 2021 నాటికి 6.4 లక్షల ఉద్యోగులు తమ కొలువు కోల్పోతారని గతంలో ఈ సంస్థ అంచనా వేసింది. అయితే తాజాగా తన అంచనాలను సవరిస్తూ, 2022 నాటికి 7 లక్షల ఉద్యోగాలు పోతాయని వెల్లడించింది.