: కృతజ్ఞతలు చెప్పకు... నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి: కశ్మీర్ బాలిక జోహ్రాకు గంభీర్ సమాధానం
మిలిటెంట్ల దాడిలో తండ్రిని కోల్పోయిన జమ్మూ కశ్మీర్‌కు చెందిన బాలిక జోహ్రా చదువుకు సాయం చేస్తానని గౌతమ్ గంభీర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతిగా జోహ్రా, గౌతమ్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పింది. దీనిపై గౌతమ్ స్పందించిన విధానానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. `జోహ్రా బేటా... నాకు కృతజ్ఞతలు చెప్పకు. అజీన్, అనైజాల లాగ నువ్వు కూడా నా కూతురి లాంటి దానివే. నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావని విన్నాను. ఆ కలను సాకారం చేసుకోవడంలో నీ మనసు పెట్టు. నీకు మేమున్నాం` అంటూ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు. తన తండ్రి మరణంతో గుండెలు పగిలేలా విలపిస్తున్న జోహ్రా ఫొటో చూసి, తన చదువుకు కావాల్సిన మొత్తాన్ని జీవితాంతం భరిస్తానని గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. గంభీర్ ఉదార స్వభావాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు.