: గౌరీ లంకేశ్ ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు... వాటి పాస్ వర్డ్ తెలిసింది ఆమెకే... పోలీసుల ముందో సవాల్!
బెంగళూరులో హత్యకు గురికాబడిన సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఇప్పుడు పోలీసుల ముందు సవాలుగా నిలిచింది. ఆమె తన ఇంట్లో అమర్చుకున్న సీసీటీవీలకు ఓ పాస్ వర్డ్ ను పెట్టుకుని ఉండటమే ఇందుకు కారణం. నిందితుల వివరాలు ఈ కెమెరాల్లో రికార్డు అయి ఉంటాయని స్పష్టం చేసిన పోలీసులు, ఇప్పుడా పాస్ వర్డ్ ను ఛేదించే పనిలో పడ్డారు. ఆ పాస్ వర్డ్ ఆమెకు మాత్రమే తెలుసునని వెల్లడించిన సిట్ అధికారులు, రాష్ట్ర సైబర్ నిపుణులు వీడియోలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తయితే, ఎంత మంది హత్యలో పాల్గొన్నారన్న విషయం తేటతెల్లమవుతుందని అంటున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ విచారణకు అత్యంత కీలకమని తెలిపారు.