: దళితులు ఉపయోగిస్తున్న బావిలో క్రిమిసంహారక మందు కలిపిన అగ్రకులస్థుడు
దళితుల దాహార్తి తీర్చుతున్న మంచి నీటి బావిలో అగ్రకులానికి చెందిన వ్యక్తి క్రిమి సంహారక ఎండోసల్ఫాన్ కలిపిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. అంటరానితనానికి పరాకాష్టగా నిలిచిన ఈ పని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాలాబుర్గి జిల్లాలోని చన్నూర్ గ్రామంలో ఏడు మంచి నీటి బావులున్నాయి. వీటిలో ఊరి లోపల ఉన్న ఆరు బావులను అగ్రకులస్థులు ఉపయోగించుకుంటుండగా, ఊరికి వెలుపల ఉన్న ఒక్క బావిని దళితులు ఉపయోగించుకుంటున్నారు.
అయితే ఈ బావి ఉన్న ప్రదేశం దళిత కులస్థునికి చెందినది. ఇటీవల వ్యవసాయంలో నష్టం రావడంతో దళిత వ్యక్తి తన భూమిని అగ్రకులానికి చెందిన గొల్లప్పగౌడకు లీజుకి ఇచ్చాడు. లీజుకు తీసుకున్న నాటి నుంచి తన భూమిలోని బావి నీటిని దళితులు ఉపయోగించుకోకుండా గొల్లప్పగౌడ అడ్డుపడుతూనే ఉన్నాడు. బావిలో నీటిని తోడుకోవడానికి అమర్చిన పంపుసెట్‌ను కూడా గొల్లప్పగౌడ తొలగించాడు. దీంతో చేంతాడు సహాయంతో దళితులు నీళ్లు తోడుకోవడం ప్రారంభించారు. ఇది చూసి ఓర్వలేక గొల్లప్పగౌడ బావి నీటిలో ఎండోసల్ఫాన్ కల్పినట్టు తెలుస్తోంది. అగ్రకులస్థుల ఆగడాలు మితిమీరుతుండటంతో దళితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.