: పట్టపగలు విచిత్ర వాతావరణం... ఎంజాయ్ చేస్తున్న హైదరాబాదీలు!


పట్టపగలు చీకట్లు కమ్మేస్తే, లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తే... సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చే వేళ ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, ఎలాంటి గ్రహణం లేకుండానే హైదరాబాద్ లో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని విధంగా కారుమబ్బులు నగరవ్యాప్తంగా అలముకోవడంతో హైదరాబాదీలకు వింతైన అనుభూతి కలుగుతోంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం నగరంపై ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. ఎక్కడా సూర్యుడు కనిపించని పరిస్థితితో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. తగినంత వెలుగులేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాహనాల వెలుగులతో రోడ్లు రాత్రిని తలపిస్తుండగా, పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. నిన్నటివరకు ఎండ బాగానే ఉండగా.. అనూహ్యంగా వాతావరణం మారిపోవడం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలంగాణ వైపుగా కదిలిన ఉపరితల ద్రోణి వల్లే హైదరాబాద్‌లో ఈ విచిత్ర పరిస్థితి నెలకొందని వాతావరణ నిపుణులు తెలిపారు.

పలువురు రోడ్లపైకి వచ్చి చీకటి వాతావరణాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మబ్బులు కమ్ముకున్నా, వర్షం ఇంకా కురవని ప్రాంతాల్లో మిద్దెలు, అపార్టుమెంట్ల పైకి వస్తున్న ప్రజలు, వింతైన వాతావరణాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఇప్పటికే ఉన్న మేఘాలకు తోడుగా, ఉత్తరాది నుంచి ఉపరితల ద్రోణిని తీసుకువచ్చిన మేఘాలు వచ్చి కలవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా, మిగతా ప్రాంతాల్లో సన్న జల్లులు కురుస్తున్నాయి. 

  • Loading...

More Telugu News