: ఆధార్ నమోదు కేంద్రాలు లేని బ్యాంకులకు ప్రతి నెలా రూ.20 వేల జరిమానా.. ఆధార్ సీఈవో హెచ్చరిక
ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలు లేని బ్యాంకులకు జరిమానా విధించనున్నట్టు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే హెచ్చరించారు. సెప్టెంబరు 30 లోపు బ్యాంకులు కనీసం పదిశాతం బ్రాంచుల్లో అయినా ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో విఫలమైన బ్యాంకులకు అక్టోబరు నుంచి ప్రతినెల రూ.20వేల చొప్పున జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు అదనపు సమయం కావాలని అడగడం వల్లే అదనంగా మరో నెల రోజుల గడవు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత కూడా కేంద్రాలను తెరవకుంటే జరిమానా చెల్లించక తప్పదన్నారు. వంద బ్రాంచులున్న బ్యాంక్ ఈ నెల 30 నాటికి కనీసం పది బ్రాంచుల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, బ్యాంకులో ఖాతా ప్రారంభించడానికి, రూ.50 వేలకుపైన నగదు లావాదేవీలు నిర్వహించడానికి ఆధార్ నంబరును ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.