: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ కు పాక్ హైకమిషన్ లో తీరని అవమానం!
పాకిస్థాన్ లో పుట్టి, దక్షిణాఫ్రికా క్రికెటర్ గా రాణించి, వరల్డ్ టాప్ 14 క్రికెటర్ల జాబితాలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ కు పాక్ హై కమిషన్ కార్యాలయంలో తీరని అవమానం జరిగింది. తనకు, తన కుటుంబ సభ్యులకు వీసా కోసం ఆయన బర్మింగ్ హామ్ లోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయానికి వెళ్లిన వేళ ఇది జరిగిందని స్వయంగా తాహిర్ వెల్లడించాడు. ఈ నెల 12 నుంచి ఇండిపెండెన్స్ కప్ లో భాగంగా, ఏడు దేశాల ఆటగాళ్లు వరల్డ్ ఎలెవెన్ జట్టుగా ఏర్పడి పాక్ తో లాహోర్ లోని గడాఫీ మైదానంలో మూడు టీ-20 మ్యాచ్ లను ఆడనున్నారు.
ఈ పోటీలకు తాహిర్ కూడా ఎంపికయ్యాడు. ఇక తనకు వీసా కోసం వెళితే తీరని బాధ కలిగిందని, దాదాపు 5 గంటల పాటు తాను వేచి చూసేలా చేయడంతో పాటు బయటకు గెంటేశారని తెలిపాడు. గంటల కొద్దీ వెయిటింగ్ అనంతరం తమ సమయం ముగిసిందని చెప్పి గెంటేశారని, ఇది తనకెంతో అవమానం అనిపించిందని చెప్పాడు. ఆపై పాక్ దౌత్యాధికారి అబ్బాస్ కల్పించుకుని తనను కాపాడాడని తెలిపాడు. ఈ ఘటన తనను కలచివేసిందని తాహిర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.