: టూర్ స్వీప్ కు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీమిండియా.. నేడే టీ20 మ్యాచ్!
శ్రీలంక టూర్ లో టీమిండియా చివరి మ్యాచ్ కు సిద్ధమైంది. నేటి సాయంత్రం శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ లలో ఘోరవైఫల్యం చవిచూసిన లంకేయులు ఈ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా అభిమానుల వ్యతిరేకత తీవ్రతను తగ్గించాలని పట్టుదలగా ఉన్నారు. అదే సమయంలో ఈ ఏకైక టీ20 మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సీరీస్ ను వైట్ వాష్ చేయాలని టీమిండియా బలంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. టీమిండియాతో పాటు శ్రీలంకలో కూడా టీ20 కోసం మార్పులు జరగనున్నాయి.
టీమిండియా ఓపెనింగ్ భారాన్ని రోహిత్ శర్మతో కలసి విరాట్ కోహ్లీ మోయనున్నాడు. ధావన్ స్వదేశానికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కేఎల్ రాహుల్, మనీష్ పాండే లను మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు తీసుకురానున్నాడు. చివరి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న కేదార్ జాదవ్ కు చోటు దక్కడం ఖాయం. హార్డిక్ పాండ్యను కూడా జట్టులోకి తీసుకురానున్నాడు. జస్ ప్రీత్ బుమ్రా ప్రధాన బౌలర్ గా వ్యవహరించనుండగా, అతనికి జోడీకి భువనేశ్వర్ లేదా శార్దూల్ ఠాకూర్ ను ఆడించనున్నాడు. లెగ్ స్పిన్నర్లపై నమ్మకముంచే కోహ్లీ ఈ మ్యాచ్ లో యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకురానున్నాడు. ప్రాక్టీస్ లేకుండానే టీమిండియా టీ20 ఆడనుంది.
మరో వైపు లంకలో కూడా భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్ సే, సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ దసున్ షనక, గాయం నుంచి కోలుకున్న పేసర్ సురంగ లక్మల్ మళ్లీ జట్టులోకి వచ్చారు. వీరికి అదనంగా మిస్టరీ స్పిన్నర్ అఖిల ధనంజయ బంతిని పంచుకోనున్నాడు. మాథ్యూస్, ఉపుల్ తరంగా ఉండనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని శ్రీలంక ఆశిస్తోంది. శక్తికి మించి కష్టపడితే అసాధ్యం కూడా కాదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ అభిమానులకు క్రికెట్ విందు పంచనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.