: ‘మరిన్ని గిఫ్ట్ ప్యాకేజ్ లు వస్తాయి’ అంటూ అమెరికాను హెచ్చరించిన ఉత్తరకొరియా
హైడ్రోజన్ బాంబును ప్రయోగించి మరోసారి దుందుడుకు చర్యకు పాల్పడిన ఉత్తరకొరియా అమెరికా నుంచి గట్టిగా హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అంతేకాకుండా ఈ రోజు అమెరికాకు హెచ్చరిక జారీ చేసింది. తాజాగా ఓ ‘గిఫ్ట్ ప్యాకేజ్’తో తాము అమెరికాకు హెచ్చరికలు చేశామని, ఇటువంటివి మరిన్ని ఉంటాయని వ్యాఖ్యానించింది.
స్విట్జర్లాండ్ లోని జనీవాలో ఈ రోజు జరిగిన ఓ సమావేశంలో ఉత్తరకొరియా దౌత్యాధికారి ఒకరు మాట్లాడుతూ... తమ దేశ రక్షణ కోసం పరీక్షించిన హైడ్రోజన్ బాంబు ‘ఓ గిప్ట్ ప్యాకేజ్’ అని అభివర్ణించారు. తమ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా నిర్లక్ష్యపూరితంగా చేస్తోన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోనంతవరకు తాము ఇటువంటి పరీక్షలు చేస్తూనే ఉంటామని చెప్పారు. అమెరికా చేస్తోన్న వ్యాఖ్యలు తమపై ఏ మాత్రం ప్రభావం చూపించబోవని వ్యాఖ్యానించారు.