: నంద్యాల, కాకినాడ ఫార్ములానే అన్ని చోట్ల అమలు చేయాలి: టీడీపీ వర్క్ షాప్ లో చంద్రబాబు
నంద్యాల, కాకినాడ ఫార్ములానే ఏపీలో అన్నిచోట్ల అమలు చేయాలని, ప్రజల్లో అసంతృప్తి ఉన్న చోట కారణాలు అన్వేషించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశించారు. అమరావతిలో రెండో రోజూ టీడీపీవర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీకి అండగా నిలబడిన నంద్యాల, కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఎన్నికలను సవాల్ గా తీసుకుని పని చేసిన నేతలకు ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు. నంద్యాల ప్రచారంలో ప్రతిపక్ష నేత జగన్ అనరాని మాటలు అన్నారని, టీడీపీ ఓడిపోతుందని విషప్రచారం చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 28 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తున్నామని, జీఎస్ డీపీ పెంపు కోసం విద్యార్థుల మాదిరి కష్టపడుతున్నామని అన్నారు. ఏపీలో సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష చూపొద్దని, వివక్ష లేనప్పుడు ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఉండదని ఈ సందర్భంగా మంత్రులకు, నేతలకు సూచించారు. ఇంటింటికీ టీడీపీ ద్వారా పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.