: ఏసీ ఆఫ్ చేసినందుకు ప్రయాణికుడిని ఇనుప రాడ్‌తో కొట్టిన ఓలా డ్రైవర్!
క్యాబ్‌లో ఏసీ ఆఫ్ చేసినందుకు హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపార వేత్తపై ఓలా డ్రైవర్ ఇనుప రాడ్‌తో దాడి చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. తీవ్రగాయాల పాలైన కేశవరావు సదాశివ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఓలా డ్రైవర్‌ను సయ్యద్ ఆరిఫ్‌గా గుర్తించి, వ్యాలికవల్‌లోని ఓలా ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే - ఓ వ్యాపార పని నిమిత్తం యశ్వంత్‌పూర్‌లో నివసించే తన స్నేహితులను కలవడానికి కేశవ రావు బెంగళూరు వెళ్లాడు. ఆ ముగ్గురు స్నేహితులు కలిసి ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌కి వెళ్లడానికి ఓలా క్యాబ్ బుక్ చేశారు. కారులో బాగా చల్లగా ఉండటంతో వెనక సీట్లో కూర్చున్న కేశవ రావు స్నేహితుడు ఏసీ ఆఫ్ చేయమని చెప్పాడు. ఆరిఫ్ ఫోన్లో బిజీగా ఉండటంతో ముందు సీట్లో కూర్చున్న కేశవ రావు ఏసీ ఆఫ్ చేశాడు. దీంతో వెంటనే ఆరిఫ్ కోపోద్రిక్తుడయ్యాడు. `నా కారును నేనే ముట్టుకోవాలి. మీరెందుకు ముట్టుకున్నారు?` అంటూ కేశవ రావును చెంప దెబ్బ కొట్టాడు. తర్వాత తెలుగు భాషను, వీరిని బూతులు తిట్టడం ప్రారంభించాడు. దీంతో ముగ్గురు కారు నుంచి దిగి వేరే క్యాబ్ కోసం చూశారు. ఈలోగా ఆరిఫ్ వెనకనుంచి వచ్చి వారిపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. కేశవ రావు ఇద్దరి స్నేహితులు భయంతో పారిపోయారు. కేశవరావు ఒంటరిగా ఉండటంతో ఆరిఫ్ అతనిపై తీవ్రంగా దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం కేశవరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.