: లేగదూడ చావుకు కారణమైనందుకు.. మహిళకు వారం రోజుల భిక్షాటన శిక్ష!
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో మటాదిన్ గ్రామంలో లేగదూడ చావుకు కారణమైనందుకు 55 ఏళ్ల మహిళకు వారం రోజుల పాటు ఊరంతా భిక్షాటన చేయాలని, ఆ డబ్బుతో గంగానది వద్దకు వెళ్లి మునక వేసి పాపప్రక్షాళన చేసుకోవాలని గ్రామపంచాయతీ శిక్ష విధించింది. ఆవు దగ్గర పాలు తాగుతున్న లేగదూడను కమ్లేశ్ తాడుతో గట్టిగా లాగింది. తల్లి దగ్గర నుంచి రావడానికి నిరాకరిస్తున్న లేగ మెడకు తాడు బలంగా బిగుసుకుపోవడంతో అది గిలగిల కొట్టుకుని చనిపోయింది. దీనిపై స్థానిక గ్రామపంచాయతీ కమ్లేశ్‌ను వారం రోజుల పాటు ఊరి నుంచి బహిష్కరించింది.
అంతేకాదు, ఏడు రోజుల పాటు ఊర్లో భిక్షాటన చేయాలని చెప్పింది. లేకపోతే జీవితకాలం పాటు ఊరి నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో గంగానదికి వెళ్లి పాపప్రక్షాళన చేసుకోవాలని కూడా తీర్పు నిచ్చింది. అసలే వయసు మీద పడటంతో రెండ్రోజులు భిక్షాటన చేయడంతో కమ్లేశ్ అనారోగ్యం పాలైందని, అప్పుడు కూడా ఆమెను ఊర్లోకి రానివ్వలేదని ఆమె కుమారుడు అనిల్ శ్రీవాస్ తెలియజేశాడు. ఇదిలా ఉండగా కమ్లేశ్ తనంతట తానే శిక్ష విధించాలని కోరినట్లు పంచాయతీ అధికారి శంభు శ్రీనివాస్ తెలిపాడు.