: ఉత్తరకొరియాను దారికి తెచ్చేందుకు బలమైన అస్త్రాన్ని బయటకు తీసిన ట్రంప్!
ఉత్తరకొరియాను దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రారంభించారు. మాటలతో ఉత్తరకొరియా దారికి రాదని గుర్తించిన ట్రంప్ బలమైన అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. హైడ్రోజన్ బాంబును విజయవంతంగా ప్రయోగించామని ఉత్తరకొరియా ప్రకటించగానే..ఆయన తన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధిస్తూ కొత్త ముసాయిదాను రూపొందిస్తున్నామని అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ కొత్త ముసాయిదా ప్రకారం ఉత్తరకొరియాతో వ్యాపారలావాదేవీలు నిర్వహించే ఏ దేశమైనా తమ దేశంతో వ్యాపారం చేసేందుకు కుదరదని స్పష్టం చేశారు.
విదేశీ వాణిజ్యం విషయంలో ఉత్తరకొరియా పూర్తిగా చైనాపై ఆధారపడుతోంది. 90 శాతం వాణిజ్య సహకారం చైనా నుంచే అందుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాతో బంధాన్ని వదులుకునేందుకు చైనా ముందుకు రాదు. వారిది అంత బలమైన బంధం. అదే సమయంలో ఆంక్షల భయంతో ఆ దేశంపై చైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉందని అమెరికా అంచనా వేస్తోంది. అలా కాని పక్షంలో తమతో వాణిజ్యాన్ని వదులుకోవాలని చెబుతోంది. దీనికి కూడా చైనా సిద్ధంగా లేదు. పోనీ ధైర్యం చేసి అమెరికాతో వాణిజ్య బంధాన్ని వదులు కుంటే చైనా చారిత్రక తప్పిదం చేసినట్టు అవుతుంది. అమెరికాతో చైనాకు వందల బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. భారీ ఎత్తున చైనా వస్తువులు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి.
ఉత్తరకొరియాను నిలువరించకపోతే...ట్రంప్ వాణిజ్య సహకారాన్ని వదులు కుంటే చైనాపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనీయులు ఉత్పత్తి చేసిన వస్తువులను మరింత చౌకగా ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల చైనా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. విదేశాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలుకుబడి పెంచుకోవాలని పరితపిస్తున్న చైనాకు అమెరికా నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.