: రేపు ఉదయం 10 గంటలకు చైనా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటీ
చైనాలో కొనసాగుతోన్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు రేపటితో ముగియనుంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ తెమెర్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రష్యా, బ్రెజిల్ దేశాల అధ్యక్షులతో మోదీ వేర్వేరుగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. వారితో రక్షణ, వాణిజ్య రంగ అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇతర దేశాల అధినేతలతోనూ మోదీ భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 10 గంటలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోదీ భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించనున్నారు. డోక్లాం ప్రతిష్టంభన అనంతరం ఇరు దేశాల అగ్రనేతలు భేటీ కానుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.