: చంద్రబాబూ.. మీరు ఎన్నిసార్లు ఓడిపోయారో గుర్తుందా?: ముద్రగడ పద్మనాభం
ప్రజలంతా మీ పక్షాన ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చు కదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కాపు నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. 2004-2014 మధ్యలో మీరు ఎన్నిసార్లు ఓడిపోయారో గుర్తుందా? అని ప్రశ్నించారు. నాన్చుడు ధోరణిని వదిలేసి, కాపులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాపులు అమ్ముడుపోయారంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని... తమ జాతిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు.
మా ఇళ్లకు వచ్చి ఓట్లను అడుక్కున్న ముఖ్యమంత్రి... ఆ తర్వాత మమ్మల్ని బూట్లతో తన్నించారని మండిపడ్డారు. మా జాతిని అమ్ముడుపోయే జాతి అని అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమానికి మేము పనికిరామని భావిస్తే... టీడీపీలో ఉన్న కాపు నేతలతో రాజీనామా చేయించి, వారికి ఉద్యమ బాధ్యతలను అప్పగించాలని అన్నారు. తమ కాపు నాయకుడు వంగవీటి మోహనరంగాపై గౌతంరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.