: 'నా స్నేహితురాలు బ్లూవేల్ గేమ్ ఆడుతోంది... రక్షించండి' అంటూ పోలీసులకు ఫోన్ చేసి... ఆమెను కాపాడుకున్న యువతి!


‘బ్లూ వేల్‌ చాలెంజ్‌’ ఆన్‌ లైన్‌ గేమ్‌ కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న వారి గురించిన వార్తలు చూస్తున్నప్పటికీ, ఆ గేమ్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే వుంది. తాజాగా చెన్నైలో ఒక బ్యాంకు ఉద్యోగిని ఈ గేమ్ బారిన పడి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడగా, ఆమె స్నేహితురాలి చొరవతో ఆమెను పోలీసులు రక్షించడం ఆసక్తి రేపుతోంది.

ఆ వివరాల్లోకి వెళ్తే... చెన్నైలోని ఓదియంశాలై పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే తన స్నేహితురాలు, సహోద్యోగిని ప్రియ (23) బ్లూవేల్ గేమ్ ఆడుతోందని, ఆమెను రక్షించాలని కోరుతూ ఓ జాతీయ బ్యాంకు ఉద్యోగిని పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు, ప్రియ నెంబర్ కు ఫోన్ చేసి, నిషేధిత బ్లూవేల్ గేమ్ ఆడుతున్నావా? అని అడిగారు.

 దీంతో తాను ఆడడం లేదని తెలిపింది. దీంతో ఆమె మొబైల్ పై పోలీసులు నిఘా పెట్టారు. బ్లూవేల్ గేమ్ అర్థరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కావడంతో పోలీసులు మరోసారి ఆ నెంబర్ కు ఫోన్ చేయగా, అది అందుబాటులో లేదు. దీంతో హుటాహుటీన వారు ఆమె ఇంటికి చేరుకున్నారు. అక్కడ విచారించగా, తమ కుమార్తె కొంత కాలంగా ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతూ వింతగా ప్రవర్తిస్తోందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. దీంతో మరింత అప్రమత్తమైన పోలీసులు, ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేయగా... ప్రియ పుదుచ్చేరి సముద్రతీరంలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి, ఆమెను రక్షించి, ఆమె సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 

  • Loading...

More Telugu News