: శ్రీలంకను వైట్ వాష్ చేసిన టీమిండియా... మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బుమ్రా!
టీమిండియా మరోసారి అదరగొట్టింది. ఆతిథ్య శ్రీలంకను టెస్టు, వన్డే సిరీస్ లలో వైట్ వాష్ చేసి తన సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. టీమిండియా ఆటతీరు ఛాంపియన్ ను తలపించింది. భువనేశ్వర్, కోహ్లీల అద్భుతమైన ప్రదర్శనతో చివరి వన్డేను టీమిండియా అలవోకగా తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భువనేశ్వర్ కుమార్ (5/42) ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం 239 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆరంభంలోనే రహానే, రోహిత్ వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లి (110 నాటౌట్) రాణించగా, అతనికి కేదార్ జాదవ్ (63) మనీష్ పాండే (36) సహకరించారు. దీంతో 46.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఆ విధంగా ఐదు వన్డేల సిరీస్ ను టీమిండియా 5-0 తేడాతో సొంతం చేసుకుంది.
కెరీర్ లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేసిన భువనేశ్వర్ కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించగా, సిరీస్ లో 15 వికెట్లతో రాణించిన జస్ ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది. ఈ టూర్ లో ఏకైక టీ20 మ్యాచ్ బుధవారం జరగనుంది. ఐతే జోరుమీదున్న టీమిండియాను శ్రీలంక అడ్డుకోగలదా? అన్నదే ప్రశ్న.