: ఇక రైల్వేలతో బంధం ముగిసింది...ఇంతకాలం సహకారమందించిన రైల్వే సిబ్బందికి ధన్యవాదాలు: సురేష్ ప్రభు
రైల్వే శాఖతో తన బంధం ముగిసిందని కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. కేంద్ర కేబినెట్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. కొత్త మంత్రులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. రైల్వే శాఖా మంత్రిగా తన బాధ్యతలు ముగిశాయని ఆయన చెప్పారు. ఇంత కాలం తనకు సహాయ సహకారాలు అందించిన రైల్వే కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. రైల్వేలలో సహాయం, సమస్యల పరిష్కారానికి ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల వివరాలను ఈ సందర్భంగా పోస్టు చేశారు. 13 లక్షల మందితో కూడిన రైల్వే కుటుంబంతో గడిపిన అనుభవాలు తనకు చిరకాలం గుర్తుంటాయని ఆయన తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొత్త మంత్రులు మరింత బాగా పని చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.