: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పట్టు సాధించిన దేశం ప్రపంచాన్ని ఏలుతుంది: రష్యా అధ్యక్షుడు పుతిన్
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. ఆ రంగంలో పట్టు సాధించిన దేశం ప్రపంచాన్ని ఏలుతుందని ఆయన చెప్పారు. `భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడనుంది. రష్యా మాత్రమే కాదు మొత్తం మానవాళి దాని ఆధారంగానే పనిచేయనుంది` అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 1న రష్యాలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. `ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎన్ని అవకాశాలున్నాయో అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని మనం ఊహించలేం. అందుకే ఈ రంగాన్ని ఒక దేశానికి మాత్రమే పరిమితం కాకుండా చూసుకోవాలి. అణుశక్తి జ్ఞానాన్ని పంచుకుంటున్నట్లుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని కూడా దేశాలు పంచుకోవాలి` అని పుతిన్ వివరించారు.