: తిరిగి టీడీపీలోకి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. బాలయ్యతో చర్చలు?
రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ తరపును రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బైరెడ్డి రాష్ట్ర విభజన సమయంలో సొంత కుంపటి పెట్టుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో కూడా రాయలసీమ పరిరక్షణ సమితి తరపున భవనాశి పుల్లయ్యను బరిలోకి దింపారు. అయితే ఊహించని విధంగా తమ అభ్యర్థికి కేవలం 154 ఓట్లు మాత్రమే వచ్చాయి.
దీంతో, తన రాయలసీమ పోరాటాన్ని విరమించుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీలోకి చేరేందుకు ఆయన దాదాపు సిద్ధమైపోయారని సమాచారం. ఈ నెల 5వ తేదీన ముచ్చుమర్రిలో తన సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారని... అక్కడే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు టీడీపీలో చేరే విషయమై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో హైదరాబాదులో ఇప్పటికే బైరెడ్డి చర్చలు జరిపారని చెబుతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల సునీత కూడా హాజరైనట్టు తెలుస్తోంది.