: హ్యూస్టన్ ప్రజలకు కొత్త సమస్య... వరద ప్రభావిత ఇళ్లలో దర్శనమిస్తున్న మొసళ్లు!
హరికేన్ హార్వే వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కున్న హ్యూస్టన్ వాసులకు మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఇళ్లకు వెళ్తున్న వారికి ఇంటి లోపల పెద్ద పెద్ద మొసళ్లు దర్శనమిస్తున్నాయి. అక్కడి హ్యారీస్ కౌంటీలో నివాసముండే బ్రయాన్ ఫోస్టర్, వరద కారణంగా తన ఇల్లు ఎంతవరకు దెబ్బతిన్నదో అంచనా వేయడానికి అక్కడికి వెళ్లారు. ఇంట్లోకి కొట్టుకు వచ్చిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తుండగా డైనింగ్ రూంలో అతనికి 9 అడుగుల మొసలి కనిపించింది.
ఇంటి అడుగు భాగం ఇంకా బురదగా ఉండటంతో మొసలి సరాసరి బ్రయాన్ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో వెంటనే ఇంట్లోంచి బయటికి వచ్చిన బ్రయాన్ అత్యవసర విభాగానికి సమాచారమిచ్చాడు. జంతుసంరక్షణ అధికారులు వచ్చి 20 నిమిషాలు కష్టపడి ఆ మొసలిని పట్టుకున్నారు. వరద నీరు అధికంగా రావడంతో హ్యూస్టన్‌లో ఉన్న మొసళ్ల పార్కు నుంచి కొన్ని మొసళ్లు తప్పించుకున్నాయని, ఇంట్లోకి వెళ్లేముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలని హ్యూస్టన్ పోలీసులు హెచ్చరించారు.