: టీవీ షోలో గమ్మత్తు: ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన అక్షయ్ కుమార్... వీడియో చూడండి!
ఇద్దరు కాదు ముగ్గురు కాదు.. ఏకంగా ఆరుగురు పిల్లలకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ జన్మనిచ్చారు. అవునండీ... త్వరలో తాను నిర్వహించబోయే `ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ 5` ప్రొమోలో అక్షయ్ కుమార్ ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లుగా నటించారు. `కత్రోం కీ ఖిలాడీ`, `మాస్టర్ షెఫ్ ఇండియా` కార్యక్రమాల తర్వాత అక్షయ్ వ్యాఖ్యానం చేయబోతున్న కార్యక్రమం ఇది. 2008లో నాలుగో సీజన్ ప్రసారమైన తర్వాత మళ్లీ 9 ఏళ్లకు ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమం గురించి టీజ్ చేస్తూ - `నాకు పులుపు తినాలనిపిస్తుంది`, `నొప్పులు ప్రారంభమయ్యాయి` అంటూ అక్షయ్ కొన్ని ట్వీట్లు చేశారు. అక్షయ్ ఇలా మాట్లాడుతున్నాడేంటీ? అని అభిమానులు అయోమయానికి గురయ్యారు. వారి షాక్‌ని పటాపంచలు చేస్తూ `ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ 5` టీజర్‌ను అక్షయ్ ట్వీట్ చేశాడు.
ఆ టీజర్‌లో అక్షయ్ గర్భంతో ఉండడం, స్కానింగ్‌లో ఆరుగురు పిల్లలు కనిపించడం, నొప్పులు రావడం, ఆ సమయంలో అక్షయ్ నవ్వుతుండటం, పిల్లలు కూడా పుట్టగానే ఏడవకుండా నవ్వుతుండటం వంటి సన్నివేశాలు చూడొచ్చు. త్వరలో స్టార్‌ప్లస్‌లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో కమెడియన్ జాకీర్ ఖాన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నాడు. గతంలో ఈ కార్యక్రమం ద్వారానే ప్రస్తుతం పాప్యులర్ అయిన కపిల్ శర్మ, సునీల్ పాల్, భారతీ సింగ్, రాజు శ్రీవాత్సవ, అహ్సాన్ ఖురేషీలు బాలీవుడ్‌కి పరిచయమయ్యారు.