: యువరాజ్ సింగ్ ను మెచ్చుకున్న ప్రధాని మోదీ!
టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ ‘యువీక్యాన్’ ఫౌండేషన్ ను నెలకొల్పి కేన్సర్ వ్యాధిని పారదోలే విషయంపై అవగాహన కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఓ లేఖ రాస్తూ సమాజానికి సేవ చేయాలన్న యువరాజ్ ఆలోచన గొప్పదని, యువీ ఇలాగే తన సేవా కార్యక్రమాలను ఉత్సాహవంతంగా కొనసాగిస్తాడని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గొప్ప క్రికెటర్, కేన్సర్ ను జయించిన వ్యక్తి అయిన యువరాజ్‌ను భారతీయులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారని అన్నారు.
ప్రధానమంత్రి మోదీ నుంచి ఈ ప్రశంస లేఖ రావడంతో యువరాజ్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. మోదీ నుంచి ఈ లేఖ రావడం తమ పౌండేషన్‌కు లభించిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. అందరూ ఒకే తాటిపై నడిస్తే ప్రపంచంలో ఎటువంటి మార్పైనా సాధ్యమేనని తమ ఫౌండేషన్ గట్టిగా నమ్ముతుందని అన్నాడు. ఒకరి జీవితంలో వెలుగులు నింపడం కంటే గొప్పదైన రివార్డ్ మరొకటి ఉండదని పేర్కొన్నాడు.