: తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ 40 కిలోమీటర్లు నడిచిన యువకుడు
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో తనకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఓ యువకుడు తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ 40 కిలోమీటర్లు నడిచాడు. తాను చేయని నేరానికి తనకు 18 రోజుల జైలు శిక్ష వేయడమే కాకుండా తనను గ్రామం నుంచి బహిష్కరించారని ఆ యువకుడు మీడియాకు తెలిపాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, మోరదా గ్రామానికి చెందిన కార్తీక్ సింగ్‌పై 2009లో ఓ నకిలీ కేసు నమోదై ఆయనకు ఈ శిక్ష పడింది.
పోలీసులు ఆయనను జైల్లో ఉంచిన కారణంగానే ఆయనను గ్రామస్తులు తన ఊరి నుంచి బహిష్కరించి, పని కూడా ఇవ్వట్లేదు. పెళ్లి చేసుకుందామంటే పిల్లను కూడా ఇవ్వడం లేదు. తమ జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్య చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. మరోపక్క అతడి తల్లిదండ్రులకు ఒక్క పూట అన్నం దొరకడమే కష్టమైపోతోంది. దీంతో ఇలా కార్తీక్ నిరసన తెలుపుతున్నాడు. తన తల్లిదండ్రులు చనిపోయేలోపైనా తాను నిర్దోషినని నిరూపించుకుంటానని చెబుతున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని తెలిస్తే తన తల్లిదండ్రులు సంతోషిస్తారని అంటున్నాడు.