: కాకినాడ ప్రజల తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతం: కళా వెంకట్రావు
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుభి మోగించడంపై మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతమని అన్నారు. గత మూడున్నరేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చంద్రబాబు చేరువయ్యారని, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూసిన ప్రజలు ఓటు రూపంలో ఇచ్చిన తీర్పే ఈ విజయం అని అన్నారు.
ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందని, మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళతానని చెప్పారు. మరో నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైసీపీ నేతల అవాస్తవ ప్రకటనలు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మలేదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీ చేశామని, తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశామని చెప్పారు.