: శ్రీలంకకు షాక్.. ప్రపంచకప్ కు నేరుగా క్వాలిఫై కాలేదు!
ప్రపంచ క్రికెట్ లో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తూ, ఓ వెలుగు వెలిగిన దేశం శ్రీలంక. బలమైన బ్యాటింగ్ ఆర్డర్, పదునైన బంతులను విసరగలిగే బౌలర్లు, అద్భుతమైన ఫీల్డర్లు ఉన్న శ్రీలంకతో ఆడాలంటే పెద్ద పెద్ద జట్లకు కూడా టెన్షన్ గా ఉండేది. అలాంటి శ్రీలంక క్రికెట్ టీమ్ గత కొంత కాలంగా పతనమవుతూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే, ఒక్క మ్యాచ్ లో అయినా గెలిస్తే చాలు అనే పరిస్థితి దాపురించింది. 1996లో ప్రపంచ కప్ విజేత అయిన శ్రీలంక... ఇప్పుడు గెలుపుకోసం ఎంతగానో వేచి చూస్తోంది.
అసలే వరుస ఓటములతో కుదేలైన శ్రీలంకకు... ఇప్పుడు భారీ షాక్ తగిలింది. 2019 ప్రపంచ కప్ కు నేరుగా క్వాలిఫై అయిన జట్ల జాబితాతో శ్రీలంక స్థానం సంపాదించలేక పోయింది. భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో కనీసం రెండు మ్యాచుల్లోనైనా గెలిస్తే, ప్రపంచ కప్ కు శ్రీలంక నేరుగా క్వాలిఫై అయ్యేది. కానీ, ఐదు వన్డేల ఈ సిరీస్ లో భారత్ ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు గెలిచింది. అయితే, నేరుగా క్వాలిఫై కావడానికి శ్రీలంకకు ఒక్క ఛాన్స్ మాత్రం మిగిలి ఉంది. ఐర్లండ్ తో వెస్టిండీస్ ఓ సిరిస్ ఆడనుంది. ఈ సిరీస్ లో విండీస్ ఓడిపోతే... అప్పుడు శ్రీలంక నేరుగా క్వాలిఫై అవుతుంది. లేకపోతే, చిన్న చిన్న దేశాలతో జరిగే క్వాలిఫయర్ మ్యాచ్ లు ఆడి, గెలవాల్సి ఉంటుంది. ఓడలు బండ్లు కావడమంటే ఇదే కాబోలు.