: ఏపీలో ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం.. 2019 కల్లా లక్ష్యాన్ని చేరుకుంటాం: లోకేశ్
2019 నాటికి రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబం నెలసరి ఆదాయం రూ.10 వేలకు చేరుకునే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2019 కల్లా ప్రతీ పేద కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయాన్ని సంపాదించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై వచ్చే వారం నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామన్నారు. అగ్రకల్చర్, ఆక్వాకల్చర్, హార్టికల్చర్ తదితర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని మంత్రి లోకేశ్ వివరించారు.