: బాప్రే!.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే రోజుకు ఐదు లక్షలమంది చక్కర్లు.. ఢిల్లీలో పోలీసులు, రవాణ వ్యవస్థల మధ్య సమన్వయ లోపం!
సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలో లైసెన్స్ రద్దు అయితే తిరిగి పొందేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. రద్దయిన లైసెన్స్‌ను మూడు నెలల లోపు పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. అయితే ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు, ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ మధ్య సమన్వయ లోపం కారణంగా లైసెన్స్ తిరిగి పొందేందుకు మరో మూడు నెలలు పడుతోంది. ఫలితంగా రోజూ ఐదు లక్షలమంది వినియోగదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే రోడ్డెక్కేస్తున్నారు. రద్దయిన లైసెన్స్‌ను తిరిగి పొందేందుకు పడరాన్ని పాట్లు పడాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదని వాహనదారులు చెబుతున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వాహనదారుల లైసెన్స్‌ను మూడు నెలలు సస్పెండ్ చేయాలంటూ 2015లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ట్రాఫిక్ పోలీసులు, రవాణా వ్యవస్థ మధ్య సమన్వయ లోపం కారణంగా సుప్రీం ఆదేశాలు సరిగా అమలు కావడం లేదు. రద్దయిన లైసెన్స్‌ను పునరుద్ధరించుకునేందుకు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయిస్తే ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి, అక్కడికి వెళ్తే ట్రాఫిక్ పోలీసులను కలవమంటూ తిప్పితిప్పి హింసిస్తున్నారని పలువురు ఢిల్లీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా లైసెన్స్ లేకుండానే రోడ్డెక్కాల్సి వస్తోందని చెబుతున్నారు. రాజధానిలో రోడ్డపైకి వస్తున్న ప్రతి 10 మంది వాహనదారుల్లో ఒకరికి లైసెన్స్ ఉండడం లేదని స్వయంగా అధికారులే చెబుతున్నారు.
నిజానికి ట్రాఫిక్ పోలీసు ఏదైనా లైసెన్స్‌ను రద్దు చేస్తే, ఆ నంబరును సంబంధిత మోటార్ లైసెన్స్ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. అక్కడ జోన్ల ప్రకారం విడగొడతారు. ఈ మొత్తం విధానం మూడు నెలల్లో పూర్తవాల్సి ఉంటుంది. అయితే ఈ వివరాలను చేతితో రికార్డులకు ఎక్కించాల్సి వస్తుండడంతో విపరీతమైన జాప్యం జరుగుతోందని తేలింది. ఇక లైసెన్స్ జోన్లను గుర్తించడంలోనూ అయోమయ పరిస్థితి ఎదురవుతుండడం మరో కారణం. ప్రస్తుతం ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యకు ఆటోమోషన్, డిజిటలైజేషన్ ఒక్కటే పరిష్కారం చూపగలదని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.