: రిపోర్టర్‌లను తిడుతున్న అమెరికా వరద బాధితురాలు... కష్టాల్లో ఉన్నపుడు ఇబ్బంది పెడతారా? అంటూ ఆగ్రహం.. వీడియో చూడండి
అమెరికాలోని హ్యూస్టన్‌ను హరికేన్ హార్వీ ముంచెత్తున్న సంగతి తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న ప్రజలను ప్రభుత్వ అధికారులు రక్షించి సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద నుంచి క్షేమంగా బయటపడ్డ వారిని సహాయ కేంద్రాల వద్ద ఉన్న మీడియా రిపోర్టర్లు ప్రశ్నలతో వేధిస్తున్నారు. వారు పెడుతున్న ఇబ్బంది తట్టుకోలేక ఓ మహిళ కెమెరా ముందే రిపోర్టర్‌ను బూతులు తిట్టేసింది.
`కష్టకాలంలో ఉన్న తమకు సహాయం చేయకుండా, టీఆర్పీల కోసం వెధవ ప్రశ్నలు వేస్తావా?` అంటూ తూర్పార బట్టింది. వరదల కారణంగా తప్పిపోయిన తమ పిల్లలను హ్యూస్టన్ కన్వెన్షన్ సెంటర్ సహాయ కేంద్రం దగ్గర కలుసుకున్న డేనియల్‌ను ఆ పక్కనే ఉన్న సీఎన్ఎన్ రిపోర్టర్ రోసా ఫ్లోర్స్ ప్రశ్నించడం మొదలు పెట్టింది. వెంటనే కోపం తెచ్చుకున్న డేనియల్ - `కెమెరాలు, మైకులతో ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? వరద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డ మా ముఖాలను చూస్తే మీకు ఇంటర్వ్యూ ఎలా చేయాలనిపిస్తుంది?` అంటూ తిట్టింది. పరిస్థితిని అర్థం చేసుకున్న రోసా ఫ్లోర్స్ మైక్ వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరింది.