: డోక్లాం వివాదంలో చైనాను భారత్ ఎంత స్ట్రాంగ్ గా నిలదీసిందో తెలుసా?
చైనా-భారత్ ల మధ్య 70 రోజుల పాటు డోక్లాం వివాదం నడిచిన సంగతి తెలిసిందే. చైనా తన అధికారిక మీడియాతో అన్ని రకాలుగా రెచ్చగొట్టినా భారత్ ఏ మాత్రం పట్టించుకోలేదు. అదే సమయంలో చైనాను ఢీ కొట్టడానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. దీంతో ఈ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం తెరవెనుక ఏం నడిచిందన్న వివరాల్లోకి వెళ్తే... జీ-20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటికే ఈ వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ జూలై 7న జర్మనీలో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వివాదాన్ని మరింత ముదరకుండా చూడాల్సిన బాధ్యత రెండు దేశాలపై ఉందని ఇద్దరూ అంగీకరించారు.
ఈ సమస్యను జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలోనే పరిష్కరించుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో సదస్సు ముగిసిన వెంటనే భారత్ చేరుకున్న మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్, ఇతర ఉన్నతాధికారుల బృందంతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా, ‘‘డోక్లాం వివాదానికి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. అదే సమయంలో డోక్లాంలో యథాతథ స్థితిపై వెనక్కి తగ్గేది లేదని చైనాకు తెలియాలి. భయపెట్టడం ద్వారా లేదా బలవంతంగా లాక్కోవడం ద్వారా వాస్తవ పరిస్థితిని మార్చాలనుకుంటే సాధ్యం కాదన్న సంగతి స్పష్టంగా చైనాకు అర్థమవ్వాలి’’ అని స్పష్టమైన సూచన చేశారు.
దీంతో ధోవల్ సారథ్యంలో భారత విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్. జై శంకర్, చైనాలో భారత రాయబారి విజయ్ గోఖలే ఆ దేశ ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. జూలై 27న అజిత్ ధోవల్ నేరుగా రంగంలోకి దిగారు. బీజింగ్ లో చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచితో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా భూటాన్ తో తాము పంచుకునే సరిహద్దు డోక్లాం అని, దానితో మీకేం సంబంధం అన్నట్లుగా ఆయన మాట్లాడడంతో స్పందించిన ధోవల్... ‘అది మీ భూభాగమా? దేశాల సరిహద్దులు పంచుకునే వివాదాస్పద భూభాగాలన్నీ మీవైపోతాయా?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
అంతే కాకుండా ‘‘భూటాన్ రక్షణ బాధ్యత మాదే. డోక్లాం భూటాన్ లో అంతర్భాగం’’ అని స్పష్టంగా తేల్చి చెప్పారు. అదే సమయంలో గతంలో డోక్లాంను తమకు ఇచ్చేస్తే అందుకు బదులుగా ఉత్తరం వైపున 500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఇస్తామని చైనా స్వయంగా భూటాన్ కు ఇచ్చిన బంపర్ ఆఫర్ ను గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యల ప్రకారం చూసుకున్నా డోక్లాం చైనాది కాదని, చైనాయే అక్రమంగా ఆ భూభాగంలో ప్రవేశించిందని వారికి అర్థమయ్యే భాషలో చెప్పారు.
అంతే కాకుండా మీ ఆఫర్ ను భూటాన్ అంగీకరించలేదని... డోక్లాంను భూటాన్ చైనాకు అప్పగించలేదని, ఆ వివాదం అలాగే ఉందని ఆయన చెప్పారు. వివాదం పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతం నుంచి ఒకేసారి రెండు దేశాల సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుందామని... ఈ సమస్యకు అదొక్కటే పరిష్కార మార్గమని స్పష్టంగా చెప్పారు. అంత స్పష్టంగా చెప్పే సరికి చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. దీంతో చైనా వెంటనే వివాదాస్పద ప్రాంతం నుంచి రోడ్డు నిర్మాణ సామగ్రిని వెనక్కి రప్పించుకుంది. దీంతో వివాదం సమసిపోయింది.