: ఇండియన్స్ ఫ్యాన్స్ లా చెత్త పనులు చేయవద్దు: మరోసారి అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు
ఆదివారం నాడు భారత్, శ్రీలంకల మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఓటమిని భరించలేని లంక ఫ్యాన్స్ బీభత్సం సృష్టించడాన్ని ప్రస్తావిస్తూ, భారత క్రీడాభిమానులపై మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందని గత నెలలో కామెంట్ చేసిన రణతుంగ, ఈసారి తమ దేశ అభిమానులకు క్లాస్ పీకుతూ, ఇండియన్ ఫ్యాన్స్ ను ముగ్గులోకి లాగడం విమర్శలకు తావిచ్చింది.
గతంలో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో అభిమానుల ఆగ్రహాన్ని ప్రస్తావించిన ఆయన, ఇండియన్ ఫ్యాన్స్ లా చెత్త పనులు చేయవద్దని, శ్రీలంకకు మంచి చరిత్ర, సంప్రదాయం వున్నాయని అన్నారు. వాటిని నిలబెట్టుకోవాలని సూచించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగరాదని, మ్యాచ్ ఓడిపోవడం బాధాకరమే అయినా, ఆగ్రహాన్ని ప్రదర్శించరాదని, ఒకసారి ఇలాంటి దురదృష్టకర ఘటన జరిగితే, అది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఆదివారం నాటి మ్యాచ్ అనంతరం కూడా రణతుంగ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రణతుంగ ఈ వ్యాఖ్యలు చేయడంపై పలువురు భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు.