: పుల్లుగా మందుకొట్టి.. ఇంటికెళ్లేందుకు ఆర్టీసీ బస్సును దొంగిలించిన మందుబాబు.. పోలీసులొస్తే వారికీ షాక్!


తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియని ఓ మందుబాబు ఇంటికెళ్లేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సును దొంగిలించాడు. కేరళలో జరిగిందీ ఘటన. బస్సు కోసం చాలాసేపు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో ఇక లాభం లేదనుకున్న మందుబాబు తానే బస్సును నడుపుకుంటూ పోయాడు. ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాక ఓ విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మత్తులో ఉన్న మందుబాబు మరో షాకిచ్చాడు. ఇంటికెళ్లేందుకు తనకు మరో వాహనం ఏర్పాటు చేయాల్సిందిగా కోరడంతో పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని అలోయ్‌సియుస్ (25)గా గుర్తించారు. కొల్లాంలో తన స్నేహితుడిని కలుసుకునేందుకు వచ్చిన అలోయ్‌సియుస్‌ను చూసిన స్నేహితుడు అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉండడాన్ని గుర్తించి తిరువనంతపురంలోని ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. స్నేహితుడి కోరిక మేరకు ఇంటికి బయలుదేరిన అలోయ్‌సియుస్ బస్సులన్నీ రద్దీగా ఉండడంతో  ఎక్కలేకపోయాడు. ఇక లాభం లేదని కొల్లాం సిటీ బస్‌స్టాండ్‌లో పార్క్ చేసిన బస్సును తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.

  • Loading...

More Telugu News