: కళ్లలో నీళ్ళు సుడులు తిరుగుతుండగా అక్కడి నుంచి వెళ్లిపోయాం: రాజీనామాకు కారణం వివరించిన జయసూర్య
శ్రీలంక జట్టు భారత్ చేతిలో దారుణమైన ఓటములను చవిచూస్తున్న నేపథ్యంలో... శ్రీలంక చీఫ్ సెలెక్టర్, ఆ దేశ దిగ్గజ క్రికెటర్ జయసూర్య తన పదవికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా తన రాజీనామాకు గల కారణాలను ఒక లేఖ ద్వారా వివరించాడు. అందులో శ్రీలంక జట్టు ప్రదర్శన తనను నిరుత్సాహపరిచిందని అన్నాడు. అయితే జట్టు వైఫల్యాల కంటే కూడా అభిమానుల తీరే తనను ఎంతగానో కలచివేసిందని చెప్పాడు. పల్లెకెలె మ్యాచ్ లో అభిమానుల ప్రవర్తన తనను బాధకు గురిచేసిందని తెలిపాడు.
తన రాజీనామా వెనుక బలమైన కారణం ఇదేనని స్పష్టం చేశాడు. మూడో వన్డే సందర్భంగా ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు తీవ్ర ఆగ్రహంతో గ్రౌండ్ లోకి బాటిల్స్ విసరడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపాడు. సొంత జట్టుపై సొంత అభిమానులే వాటర్ బాటిల్స్ తో దాడిచేయడం చూసి తట్టుకోలేకపోయానని ఆయన చెప్పాడు. చెప్పలేని బాధతో కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా అక్కడి నుంచి వెళ్లిపోయామని జయసూర్య తెలిపాడు. కాగా, శ్రీలంక జట్టుకు జయసూర్య ఒంటిచేత్తో విజయాలు అందించిన సంగతి తెలిసిందే.