: ఉత్తరకొరియా దూకుడుతో భయంకరమైన అణుబాంబును పరీక్షించిన అమెరికా
ఉత్తరకొరియా దూకుడుగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. గ్వామ్ దీవిని నాశనం చేస్తానని హెచ్చరిస్తూ తాజాగా మధ్యంతర క్షిపణి పరీక్ష నిర్వహించి, దక్షిణ కొరియా, జపాన్ లను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. ఆ దేశాల ఫిర్యాదుతో ఐక్యరాజ్యసమితి ఉత్తరకొరియాను తీవ్రంగా మందలించింది. ఉత్తరకొరియాతో ముప్పు పొంచి ఉండడంతో అమెరికా తన ఆయుధగారం నుంచి ఆయుధాలను బయటకు తీస్తోంది. అణుశక్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అత్యంత ప్రమాదకరమైన బీ61-12 అనే అణుబాంబును పరీక్షించింది. నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎఫ్-15ఈ విమానం ద్వారా ఈ బాంబును పరీక్షించడం విశేషం. ఇది భయంకరమైన బాంబని, ఇది పేలితే తీవ్రస్థాయిలో విధ్వసం జరుగుతుందని అమెరికా చెబుతోంది. ఇప్పటివరకు అమెరికా తయారు చేసిన అణుబాంబులన్నింటిలో ఇదే అత్యంత శక్తివంతమైన అణుబాంబని తెలుస్తోంది.
ఇది లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యంత సమర్థవంతంగా పని చేస్తుందని అన్నారు. ఈ బాంబు తయారీకి ట్రిలియన్ డాలర్లు (లక్ష కోట్ల డాలర్లు) ఖర్చు చేస్తోందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 8న నెవెడా స్టేట్ లోని తొనొపహ్ టెస్ట్ రేంజ్ ఎడారిలో ఈ అణుబాంబును పరీక్షించినట్టు వారు చెబుతున్నారు. ఇది గ్రావిటీ బాంబని, దీనిని ప్రయోగించేందుకు న్యూక్లియర్ వార్ హెడ్స్ తో పని లేదని, విమానం నుంచి లక్ష్యానికి జారవిడిస్తే చాలని వారు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను కొన్ని నెలలపాటు అమెరికా శాస్త్రవేత్తలు సేకరించనున్నారు. పరిక్ష పూర్తిగా విజయవంతమైందని నిర్ధారించుకున్న అనంతరం అమెరికా ఆయుధగారాన్ని ఈ అణుబాంబులతో నింపనున్నారు. దీనిపై అణుశక్తి నిరోధం కోసం పోరాడుతున్న వారు అభ్యంతరం తెలిపారు. ట్రంప్ అధికారం చేపట్టిన తరువాతే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని వారు మండిపడ్డారు.