: నేను కూడా ఆయనతో పాటు జైల్లోనే ఉంటా: హర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. తనకు జైలులో తోడుగా ఉండేందుకు తన దత్తకూతురు హనీప్రీత్ ఇన్సాన్‌ను కూడా జైల్లో ఉంచాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేయగా ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా హనీప్రీత్ కూడా కోర్టులో ఇటువంటి పిటిషనే వేసింది. గుర్మీత్ సింగ్‌కు హెల్పర్‌గా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరిందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాకు తెలిపారు. ఆమె పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు.
అలాగే డేరా స్వచ్చా సౌధా మద్దతుతోనే తాము గత ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని ఆ సంస్థ చేసిన ప్రకటనను ఖట్టర్ కొట్టిపారేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సందర్భంగా అన్ని సంఘాలనుంచి తాము మద్దతు అడగవచ్చని చెప్పారు. తాను రాజీనామా చేయాలని అంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. తాము శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు హర్యానాలో శాంతి నెలకొందని చెప్పారు.