: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు రాజకీయాలు చేస్తున్నారు: స్టాలిన్ తీవ్ర ఆరోపణలు
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు రాజకీయాలు చేస్తున్నారంటూ డీఎంకే నేత స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. విపక్ష పార్టీలతో పాటు స్టాలిన్ ఈ రోజు గవర్నర్ ను కలిశారు. సీఎం పళనిస్వామిని అసెంబ్లీలో బలనిరూపణకు ఆదేశించాలంటూ ఈ సందర్భంగా ఆయన కోరారు. అనంతరం, విలేకరులతో స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని మొదటి నుంచి చెబుతున్నామని విమర్శించారు.
తమ భాగస్వామ్య పార్టీలతో రేపు ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నట్టు స్టాలిన్ చెప్పారు. రాష్ట్రపతిని కలసిన తర్వాత కూడా తమిళనాడు ప్రభుత్వం చర్య తీసుకోకుంటే, కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. కాగా, ఇప్పటివరకు రాజ్ భవన్ చుట్టూ తిరిగిన తమిళ రాజకీయం ఢిల్లీకి చేరనుండటం గమనార్హం.