: భారత ఆర్మీ గీత దాటడం వల్లే డోక్లాం సమస్య ప్రారంభమైంది: చైనా మంత్రి
డోక్లాం నుంచి భారత్, చైనా ఆర్మీ ఒకేసారి వెనక్కు వెళ్లిన విషయం తెలిసిందే. భారత ఆర్మీనే వెనక్కి వెళ్లాలని మొదట వాదించిన చైనా చివరకు ఇండియా డిమాండ్ చేసినట్లుగానే ఇరుదేశాల సైన్యాలు ఒకేసారి వెనక్కువెళ్లాలనే సూచనను పాటించింది. అయినప్పటికీ చైనా మాత్రం తమదే పై చేయి అన్నట్లు వ్యవహరిస్తోంది. డోక్లాం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని, అంతర్జాతీయ చట్టాల గురించి తెలుసుకోవాలని నిన్న చైనా ఆర్మీ అధికారి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ రోజు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసి తమ బుద్ధిని బయటపెట్టుకున్నారు. తాజాగా, మీడియాతో మాట్లాడుతుండగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. డోక్లామ్ నుంచి వెనక్కితగ్గి చైనా తన పరువు కాపాడుకుందా? అని మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ డోక్లాం సమస్య భారత ఆర్మీ గీత దాటడం వల్ల తలెత్తిందని అన్నారు. ప్రస్తుతం ఆ సమస్య తొలగిపోయిందని అన్నారు. మీడియాలో ఎన్నో పుకార్లు వస్తాయని వ్యాఖ్యానించిన ఆయన.. తాము అధికారికంగా విడుదల చేసిన ప్రకటనే వాస్తవమని అన్నారు.