: ముస్లిం పురుషులకు తలాఖ్ ఇచ్చే విధానాలను బోధిస్తున్న మదర్సాలు!
ఉత్తర ప్రదేశ్‌లోని మదర్సాలు ఇప్పుడు ముస్లిం పురుషులకు తలాఖ్ ఇచ్చేందుకు సరైన విధానాలను బోధించడం మొదలు పెట్టాయి. ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఇలాంటి బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం గమనార్హం. షరియా చట్టం గురించి ముస్లిం పురుషులకు తెలియజేస్తూ, విడిపోవాలనుకున్నపుడు ఇన్‌స్టంట్ తలాఖ్ కాకుండా చట్టంలో సూచించిన ఇతర సదుపాయాలను గురించి మదర్సాలు బోధించనున్నాయి.
ముస్లిం వివాహ నియమాలు, విడిపోయే విధానాలు, చెల్లించాల్సిన భరణాలకు సంబంధించి షరియా చట్టంలో క్షుణ్ణంగా వివరించారని, వాటిని సరిగ్గా పాటించడం వల్ల ముస్లిం మహిళలకు అన్యాయం జరగదని, ఆ నిబంధనలన్నీ మహిళలకు మద్దతుగానే ఉన్నాయని జమత్ రజా ఏ ముస్తాఫా జాతీయ కార్యదర్శి మౌలానా షహబుద్దీన్ రజ్వీ తెలిపారు. 150కి పైగా మదర్సాల్లో ఈ నియమాలను ముస్లిం పురుషులకు బోధించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే వ్యక్తిగత విషయాలను కోర్టు వరకు తీసుకెళ్లవద్దని ముస్లిం మహిళలను జమత్ రజా ఏ ముస్తాఫా కోరినట్లు ఆయన వివరించారు.