: హరికేన్ హార్వీపై ట్రంప్ వైఖరి పట్ల నెటిజన్ల ఆగ్రహం... `ఏం అధ్యక్షుడివి నువ్వు?` అంటూ వ్యాఖ్యలు
అమెరికాలోని టెక్సాస్, హ్యూస్టన్ ప్రాంతాలను హరికేన్ హార్వీ ముంచెత్తుతుంటే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో కూర్చొని వెకిలి ట్వీట్లు చేయడంపై అమెరికన్ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. `గత 500 ఏళ్లలో వచ్చిన గొప్ప తుపాను`, `గొప్ప తుపానును అడ్డుకోగల సామర్థ్యం అమెరికాకు ఉంది`, `అధికారులంతా బాగా పనిచేస్తున్నారు`, `హార్వీ గురించి మీటింగ్ ఏర్పాటు చేశాను` అంటూ ట్రంప్ వివిధ ట్వీట్లు చేశారు.
వరద బాధితులకు సహాయ చర్యలను పర్యవేక్షించకుండా ఇంట్లో కూర్చుని ఇలాంటి ట్వీట్లు చేయడంపై చాలా మంది నెటిజన్లు ట్రంప్‌ను తూర్పారబట్టారు. `నీ హయంలో తుపాను రావడం అదృష్టంగా భావిస్తున్నావా? దీన్ని రికార్డుగా ఫీల్ అవుతున్నావా?`, `ఏం అధ్యక్షుడివి నువ్వు?... ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేయడానికేనా నిన్ను ఎన్నుకుంది?`, `తుపానును కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నిన్ను చూసే నేర్చుకోవాలి` అంటూ రకరకాలుగా ట్రంప్‌ను దూషించారు.