: కోర్టు దోషిగా నిర్ధారించిన తరువాత డేరా బాబాను తప్పించేందుకు యత్నించిన అనుచరులు.. కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు!
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను దోషిగా నిర్ధారించిన అనంతరం కోర్టు హాల్ నుంచి జైలుకు తరలించే క్రమంలో ఆయనను తప్పించేందుకు డేరా అనుచరులు ప్లాన్ వేశారని హర్యాణా పోలీసులు సంచలన విషయం వెల్లడించారు. అందుకు వారు వేసిన స్కెచ్ ను ఎఫ్ఐఆర్ లో వివరించారు. దాని వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం పంచకులలో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన తరువాత గుర్మీత్ ను జైలుకు తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో అతనిని స్కార్పియో కారులో ఎక్కించారు. ఆయనకు రెండు వైపులా గార్డులు కూర్చున్నారు. కోర్టు కాంప్లెక్స్ నుంచి జైలుకు వెళ్లేందుకు మధ్యలో పోలీసు పికెట్ ను దాటాల్సి ఉంది.
అక్కడ డేరా బాబా అనుచరులు కాపుకాశారు. పోలీసుల స్కార్పియో పికెట్ ను చేరుకునేలోపు తమ కారుతో దానిని అడ్డగించారు. బాబాను అడ్డగించాలని కేకలు వేశారు. దీంతో స్కార్పియో నుంచి ఆరుగురు పోలీసు అధికారులు తుపాకులతో బయటకు దిగారు. దీంతో వారు షాక్ తిన్నారు. దీంతో కారుతో వారిని గుద్దించి బాబాను ఎత్తుకుపోవాలని నిర్ణయించుకుని ముందుకు వచ్చారు. అంతలో పోలీస్ పికెట్ నుంచి మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వారి ఆటలు సాగలేదు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలన్నింటితో హర్యాణా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో గుర్మీత్ రాం రహీం సింగ్ కు మరిన్ని తిప్పలు తప్పేలాలేవు.