: వివాదాల సీరియల్ `పహ్రేదార్ పియా కీ` ప్రసారం నిలిపివేత... కొత్త కథతో వస్తామంటున్న యూనిట్
విమర్శకుల నుంచి వివాదాలు వెల్లువెత్తడంతో `పహ్రేదార్ పియా కీ` సీరియల్ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు సోనీ టీవీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇదే బృందంతో, మంచి కథతో మళ్లీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని సీరియల్ యూనిట్ తెలిపింది. 18 ఏళ్ల యువతి, 10 ఏళ్ల బాలుణ్ని పెళ్లి చేసుకునే కథాంశంతో వచ్చిన `పహ్రేదార్ పియా కీ` సీరియల్ ప్రోమోలు వస్తున్నప్పటి నుంచే ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యాక ప్రేక్షకులు కథను అంగీకరించినా, మూడో వారం వచ్చేసరికి బాలుడు, యువతి మధ్య హనీమూన్ సన్నివేశాలు రావడంతో వ్యతిరేకత తీవ్రతరమైంది.
ఈ సీరియల్ వల్ల సమాజంపై, ముఖ్యంగా పిల్లలపై దుష్ప్రభావం పడుతుందంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కారణంగా మొదట్లో సీరియల్‌ను నిలిపివేయడానికి యూనిట్ ఒప్పుకోలేదు. కానీ సోనీ బృందం ఒత్తిడి చేయడంతో ప్రసారాలను నిలిపి వేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సీరియల్ నిర్మాతగా వ్యవహరించిన సుమీత్ మిట్టల్ గతంలో అందించిన `దియా ఔర్ బాతీ హమ్ (తెలుగులో `ఈతరం ఇల్లాలు`)` సీరియల్ మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే.