: ఏపీ ఓటర్లు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు.. జగన్, పవన్ ల ను నమ్మలేని పరిస్థితిలో జనాలు ఉన్నారు: కత్తి మహేష్


పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్... ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఓటర్లు ప్రస్తుతం చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చారని... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన మేనిఫెస్టోకు, వాస్తవికతకు సంబంధం లేకుండా ఉందని అన్నారు. ప్రజలకు చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని... ఆ అరచేతిలో స్వర్గం ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు. చంద్రబాబు కొత్త ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

మరోవైపు, ప్రతిపక్షమైన వైసీపీ స్టాండ్ ఏంటో అర్థం కావడం లేదని... ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందని మహేష్ చెప్పారు. ప్రతిపక్షం చేయాల్సిన పనిని ఆ పార్టీ చేయడం లేదని... అందువల్ల వైసీపీని, జగన్ ను నమ్మలేమని తెలిపారు. మేనిఫెస్టోను అమలు చేయలేని టీడీపీని కూడా ఇప్పటికిప్పుడు నమ్మలేమని చెప్పారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాను రాజకీయాల్లోకి ఫుల్ టైమ్ ఎంట్రీ ఇస్తానని చెబుతున్నారని... ఈ నేపథ్యంలో, ప్రజలు ఎవరివైపు ఉండాలనే విషయంలో కన్ఫ్యూజన్ కు గురవుతారని అన్నారు. అసలైన రాజకీయం ఇప్పట్నుంచే ప్రారంభం అవుతుందని చెప్పారు. ప్రతి ఒక్క పార్టీ కూడా ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉందని... అప్పుడే ఎవరివైపు ఉండాలనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకుంటారని తెలిపారు.

తెలంగాణలో కొంచెం క్లారిటీ ఉందని... తెలంగాణ సెంటిమెంట్ తో టీఆర్ఎస్ మరో టర్మ్ కొట్టుకొస్తుందనే క్లారిటీ ఇక్కడ ఉందని మహేష్ అన్నారు. ఏపీలో పూర్తి కన్ఫ్యూజన్ ఉందని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఏపీలో ఏం జరగబోతుందో చెప్పలేమని... ప్రతి నెలా మారే పరిణామాలతో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడేమీ జడ్జ్ చేయలేమని... వేచి చూడాల్సిందేనని చెప్పారు.

  • Loading...

More Telugu News