: దురంతో రైలు ప్రమాదం: 1200 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ సమయస్ఫూర్తి!
మంగళవారం ఉదయం నాగ్‌పూర్-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. గత పది రోజుల్లో దేశంలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇది నాలుగోది. కసరా ఘాట్స్ పరిధిలో భారీ వర్షాల కారణంగా మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల ట్రాక్ దెబ్బతినడమే రైలు పట్టాలు తప్పడానికి కారణమని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో రైలులో 1200 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదం నుంచి వీరు సురక్షితంగా బయటపడడం వెనక రైలు డ్రైవర్ రవీంద్ర సింగ్ సమయస్ఫూర్తి వుందని రైల్వే అధికారులు తెలిపారు.
అసాన్‌గావ్-వసింద్ మధ్య ఉదయం 6:36 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌లో ఏదో తేడా గమనించిన డ్రైవర్ రవీంద్ర సింగ్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. ఆయన కానీ ఆ పనిచేయకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని దక్షిణమధ్య రైల్వే ముఖ్య అధికార ప్రతినిధి సునీల్ ఉదాసి తెలిపారు. ఆయన చాలా మంచి పనిచేశారని ప్రశంసించారు. రైలు కోచ్‌లు లింకె హోఫ్‌మాన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) అనే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారవడం వల్ల ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా ఒకదాని మీద ఒకటి ఎక్కే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రహించే డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి 1200 మంది ప్రాణాలను కాపాడారని అభినందించారు. 9 కోచ్‌లు పట్టాలు తప్పినా ప్రాణనష్టం లేకపోవడానికి డ్రైవర్ సమయ స్ఫూర్తే కారణమని కొనియాడారు.