: మీకు రాచమర్యాదలు అందజేస్తామని సౌదీ రాజు ఆఫర్ ఇస్తే...ఆ పెద్దామె చెప్పిన సమాధానం ఇదే!


మీకు రాచమర్యాదలు చేస్తాం, మిమ్మల్ని చక్కగా చూసుకుంటామని సౌదీరాజు ఆఫర్ ఇస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు...కానీ ఇండోనేషియాకు చెందిన మరిహా మర్ఘానీ మహ్మద్ (104) మాత్రం సున్నితంగా తిరస్కరించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ముస్లింల పవిత్ర క్షేత్రమైన మక్కాయాత్రకి ప్రపంచ దేశాల నుంచి ఎన్నో లక్షల మంది ప్రతియేటా వస్తుంటారు. అలాగే ఈ ఏడాది కూడా వివిధ దేశాల నుంచి 2 లక్షల 21వేల మంది మక్కా యాత్ర నిమిత్తం సౌదీకి వస్తున్నారు. దీంతో మక్కా పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు సర్వసాధారణమైపోయాయి. ఈ పరిస్థితిలో ఇండోనేషియా నుంచి విమానం రాగానే సౌదీ కాన్వాయ్ విమానాశ్రయానికి చేరుకుంది.

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందుగానే ట్రాఫిక్ క్లియర్ చేసింది. విమానం నుంచి దిగగానే వారిని ప్రత్యేక కాన్వాయ్ లో ఎక్కించుకుని సురక్షితంగా మక్కా చేర్చింది. ఇవన్నీ 104 ఏళ్ల మర్ఘానీ కోసం చేసింది. సౌదీ సంప్రదాయం ప్రకారం మక్కా యాత్రికుల్లో అత్యధిక వయస్కులను ముఖ్య అతిథులుగా భావిస్తుంది. వారిని ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో యాత్రను చేయిస్తుంది. విమానం దిగినప్పటి నుంచి విమానం తిరిగి ఎక్కేవరకు అడుగులకు మడుగులొత్తుతూ సపర్యలు చేస్తారు. ఈ ఏడాది మరిహా మర్ఘానీ మహ్మద్ కు ఈ అవకాశం లభించింది. దీంతో ఆమెను సౌదీరాజు ఆహ్వానించగా...తొలుత ఆ ఆఫర్ ను ఆమె సున్నితంగా తిరస్కరించింది.

తనను మక్కాయాత్రకు తీసుకు వచ్చి, తిరిగి క్షేమంగా తీసుకువెళ్తామని ఓ ఇద్దరు దంపతులు ముందుకు వచ్చారని సౌదీ రాజుకు తెలిపింది. వారు తనను కన్నతల్లిలా చూసుకుంటున్నారని కూడా చెప్పింది. వారు తన పక్కింట్లోనే ఉంటారని, తన సంరక్షణ బాధ్యతలు వారే చూసుకుంటున్నారని, వారు తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోగలరని, తనకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు అవసరం లేదని స్పష్టం చేసింది.

అంతే కాకుండా వారిని మధ్యలో వదిలి, తాను ప్రభుత్వ మర్యాదలు పొందలేనని స్పష్టం చేసింది. దీంతో వెంటనే స్పందించిన రాజ ప్రతినిధులు, ఆమెను తీసుకుని వచ్చిన వారిని కూడా తమ అతిథులుగా చూసుకుంటామని చెప్పడంతో ఆనందంగా ఆమె అంగీకరించింది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. దీనిపై మక్కా యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌదీ రాజును కీర్తిస్తున్నారు. 

  • Loading...

More Telugu News