: ‘సినిమా’ నాకు ఉపయోగపడలేదు: నటుడు కోట శంకరరావు
సినీ రంగానికి తాను ఉపయోగపడ్డానే తప్పా,‘సినిమా’ తనకు ఉపయోగపడలేదని ప్రముఖ సినీ నటుడు కోట శంకరరావు అన్నారు. చిన్ననాటి నుంచి తనకు నాటకాలంటే ఇష్టమని, తన పెద్దన్నయ్య కోట నరసింహారావు ప్రోత్సాహంతో నాటకరంగంలోకి ప్రవేశించానని, 500 నాటకాల్లో అన్నిరకాల పాత్రలు పోషించానని చెప్పారు. 'రసరాజ్యం' అనే నాటకం తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందని, ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చానని చెప్పారు.
ముప్పై ఐదేళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను ఇప్పటివరకూ వందకు పైగా చిత్రాల్లో నటించానని, అంకురం, సూత్రధారులు, పల్నాటి పౌరుషం, చీమలదండు సినిమాలు తనకు మంచి పేరు తెచ్చాయని చెప్పుకొచ్చారు. శ్రీనాథ కవిసార్వభౌమ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ తోను, సూత్రధారులు, రగులుతున్న భారతం చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావుతోను కలిసి నటించడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. ఇప్పటివరకూ 64 టీవీ సీరియల్స్ లో నటించానని చెప్పారు.
కాగా, విశాఖపట్టణం జిల్లాలోని ఎస్.రాయవరం మండలంలోని కొరుప్రోలులో రంగస్థల నటుడు నాగం కామేశ్వరరావు వర్థంతి సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన కోట శంకరరావును కలసిన పాత్రికేయులతో ఆయన పై విషయాలు చెప్పారు. ఇదిలా ఉండగా, విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకరరావు అన్న సంగతి విదితమే!