: చంద్రబాబు దొడ్డిదారులు వెతుక్కునే వ్యక్తి!: కొడాలి నాని తీవ్ర వ్యఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోటుగాడేమీ కాదని, అంత అనుభవజ్ఞుడు కాదని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గంలోనే గెలవలేని చంద్రబాబు... సొల్లు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే తమ పార్టీ నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఇంకా దమ్ముంటే మొత్తం 175 స్థానాల్లో పోటీకి రావాలని... అప్పుడు దాన్ని తాము రెఫరెండంగా భావిస్తామని చెప్పారు.
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు ఎంపీ స్థానాల్లో డిపాజిట్ కూడా రాలేదని... 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 21 చోట్ల డిపాజిట్ రాలేదని, 10 చోట్ల మూడో స్థానంతో సరిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో 39 మంది పోస్టల్ బ్యాలెట్లను పంపితే... అవి కూడా చెల్లలేదని, ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారని అన్నారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సొంత నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎన్నికలు జరగ్గా... ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేదని కొడాలి నాని అన్నారు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో పోరాటం చేశానంటూ సొల్లు చెబుతుంటారని... ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పై పోటీ చేస్తానన్న చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైసీపీ అంచెలంచెలుగా ఎదుగుతోందని... 2019లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. చంద్రబాబు దొడ్డిదారులు వెతుక్కునే వ్యక్తి అని... జగన్ మాత్రం మాట తప్పని, మడం తిప్పని నాయకుడని అన్నారు. నంద్యాల సీటు వైసీపీదే కాబట్టి, అక్కడ పోటీ చేశామని చెప్పారు.