: ఉత్తర కొరియా న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ లు.. ఆందోళనలో అమెరికా!
అంగ, అర్ధ బలంతో ప్రపంచాన్ని భయపెట్టే అమెరికాను ఉత్తరకొరియా ఉలిక్కిపడేలా చేసింది. సుదీర్ఘ కాలంగా తమను కట్టడి చేస్తామంటూ అమెరికా చేసిన ప్రకటనలను పట్టించుకోని ఉత్తరకొరియా... తాజాగా న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ లు నిర్వహించడం ద్వారా అమెరికాను ఆందోళనకు గురించేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా నిర్వహించిన న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ లు కలవరపాటుకు గురి చేశాయని అమెరికా ప్రభుత్వ కార్యదర్శి రేక్స్ టెల్లర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరకొరియాలా తాము రెచ్చగొట్టే చర్యలు ప్రారంభించాలని భావించడం లేదని అన్నారు.
శాంతియుత ఒత్తిడితోనే ఉత్తరకొరియాతో సామరస్యవాతావరణం నెలకొల్పేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. అయితే ఉత్తరకొరియా మాత్రం ఎప్పటికప్పుడు తమ శాంతియుత ప్రయత్నాలకు తూట్లు పొడుస్తోందని ఆయన మండిపడ్డారు. దీంతో చైనా సాయంతో ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశామని, అయినప్పటికీ ఫలితం లేదని ఆయన చెప్పారు. తాజాగా దక్షిణకొరియాతో కలిసి తమ సైన్యం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఉత్తరకొరియా రెచ్చగొట్టేలా వ్యవహరించడం మంచిది కాదని ఆయన సూచించారు. తాము శాంతికి కట్టుబడి ఉన్నామని, రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలు జరుగుతాయని ఆయన అన్నారు.