: ప్రభుత్వాన్ని మేము పడగొట్టాల్సిన పని లేదు...అదే కూలిపోతుంది: స్టాలిన్ ధీమా
తమిళనాడులో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని, దానంతట అదే కూలిపోతుందని ప్రతిపక్ష నేత స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకేలో మరోసారి చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో చెన్నైలో ఆయన మాట్లాడుతూ, 19 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు గవర్నర్ కు లేఖలు సమర్పించారని గుర్తు చేశారు. వారే కాకుండా దినకరన్ వైపు మరికొందరు కూడా ఉన్నారని, వారిని స్లీపర్ సెల్స్ అంటున్నారని కూడా ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో గవర్నర్ మంచి నిర్ణయం తీసుకుంటారని చూస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఈ మేరకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ కు లేఖ ఇచ్చామని ఆయన తెలిపారు. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. పళని, పన్నీరు విలీనం సందర్భంగా ముంబై నుంచి ఆగమేఘాల మీద చెన్నై వచ్చిన గవరనర్.. పన్నీరు సెల్వం, మాఫోయ్ పాండియరాజన్ తో ప్రమాణ స్వీకారం చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆయన అలాగే స్పందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.