: ఏ క్యాబ్ చౌక? అని ప్రశ్నించిన యువకుడు... వైరల్ అయిన ట్వీట్ చూసి 'ఉచితం' అన్న ఓలా!
బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తన బధిర మిత్రులను తీసుకుని మైసూరుకు ఓ జాలీ ట్రిప్ కు వెళ్లాలని భావించి, ఏ క్యాబ్ కంపెనీ కారు తీసుకువెళితే చౌక? అని ట్విట్టర్ లో ప్రశ్నించగా, ఓ క్యాబ్ సంస్థ అద్భుతంగా అశ్చర్య పరిచింది. నిషాంత్ కోయల్హో అనే 23 ఏళ్ల యువకుడు తాను బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లేందుకు ఓలా క్యాబ్స్, ఉబెర్ ఇండియాలలో ఏది చౌకగా లభిస్తుందో చెప్పాలని ఆగస్టు 23న తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించాడు.
ఈ ట్వీట్ వైరల్ కాగా, వందలాది షేర్ లను దక్కించుకుంది. ఈ ట్వీట్ క్యాబ్ సేవల దిగ్గజం ఓలా కంటబడింది. తమ కారులో ఎందుకు ఉచితంగా రైడ్ చేయకూడదు? అని అడిగింది. దీనిపై నిషాంత్ స్పందిస్తూ, "సీరియస్ గా చెబుతున్నారా? లేక ఆటపట్టిస్తున్నారా?" అని అడుగగా, ఓలా స్పందిస్తూ, "మీ వారాంతం ఆనందంగా గడిపేందుకు మేమిస్తున్న బహుమతిగా దీన్ని స్వీకరించండి. మిమ్మల్ని తిరిగి వెనక్కు తీసుకువస్తాం కూడా" అని సమాధానం ఇచ్చింది. ఓలా క్యాబ్ బుక్ చేసుకుని దాని సీఆర్ఎన్ నంబర్ పంపించాలని సూచించింది.