: భారత నూతన చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రాతో ప్రమాణం చేయించిన కోవింద్
భారత నూతన చీఫ్ జస్టిస్ గా ఇటీవల నియమితులైన దీపక్ మిశ్రాతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ జగదీశ్ సింగ్ కేహార్ స్థానంలో దీపక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 64 సంవత్సరాల దీపక్ మిశ్రా, ఒడిశా హైకోర్టులో రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, రెవెన్యూ సేవలతో పాటు సర్వీస్ ట్రైబ్యునల్ లో సేవలందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి తన వారసుడిగా మిశ్రాను స్వయంగా కేహార్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే మిశ్రా, ముంబై దాడుల్లో యాకూబ్ మెమన్ కు శిక్ష సహా పలు కీలక కేసుల్లో సంచలన తీర్పులు ఇచ్చారు. రామ మందిరం, బాబ్రీ మసీదుపై జరుగుతున్న విచారణ ధర్మాసనంలోనూ ఆయన న్యాయమూర్తిగా ఉన్నారు. 1977లో న్యాయవాద వృత్తి చేపట్టిన ఆయన, ఒడిశా హైకోర్టుకు జనవరి 1996లో అనదపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆపై 1997లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, ఆపై 2009లో పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2010 నుంచి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏడాది పాటు విధులు నిర్వహించిన ఆయన్ను, 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు.